Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 67

Rama breaks Siva's Bow!!

 

|| om tat sat ||

బాలాకాండ
అఱువది ఏడవ సర్గము

జనకస్య వచశ్రుత్వా విశ్వామిత్రో మహామునిః |
ధనుర్దర్శయ రామాయ ఇతిహోవాచ పార్థివమ్ ||

స|| మహామునిః విశ్వామిత్రః జనకస్య వచః శ్రుత్వా రామాయ ధనుః దర్శయ ఇతి పార్థివం ఉవాచ హ ||

తా|| మహాముని అయిన విశ్వామిత్రుడు జనకుని మాటలను విని రామునకు ధనస్సును చూపించుడు అని ఆ రాజుతో చెప్పెను.

తతస్స రాజా జనకః సామంతాన్ వ్యాదిదేశహ |
ధనురానీయతాం దివ్యం గంధమాల్యావిభూషితమ్ |

స|| తతః స రాజా సామంతాన్ దివ్యం గంధమాల్యావిభూషితం ధనుః ఆనీయతాం ఇతి వ్యాదిదేశ హ ||

తా|| అప్పుడు ఆ రాజు సామంతులను దివ్యమైన గంధముతోనూ మాలలతోనూ అలంకరించబడిన ధనస్సు ను తీసుకురండు అని ఆదేశము ఇచ్చెను.

జనకేన సమాదిష్టాః సచివాః ప్రావిశన్ పురీం |
తద్దనుః పురతః కృత్వా నిర్జగ్ముః పార్థివాజ్ఞయా ||

స|| జనకేన సమాదిష్టాః సచివాః పురీం ప్రావిశన్ | పార్థివాజ్ఞయా తత్ ధనుః పురతః కృత్వా నిర్జగ్ముః ||

తా|| జనకునిచేత అదేశించబడిన వారై ఆ మంత్రులు నగరము వెళ్ళిరి. రాజాజ్ఞతో ఆధనస్సును ముందు ఉంచుకొని బయలు దేరిరి.

నృణాం శతాని పంచాశత్ వ్యాయతానాం మహాత్మనాం|
మంజూషాం అష్టచక్రాం తాం సమూహుస్తే కథంచన ||

స||వ్యాయతానాం మహాత్మనాం నృణాం పంచాశత్ మంజూషాం అష్ఠచక్రాం తాం కథంచ సమూహస్తే ||

తా|| మహా బలశాలురైన ఇదువేలమంది మనుష్యులు ఎనిమిది చక్రములు గల మంజూషమును అతిఅకష్ఠముతో తీసుకు వచ్చిరి.

తామాదాయతు మంజూషాం అయసీం యత్ర తద్దనుః |
సురోపమం తే జనకం ఊచు ర్నృపతిమంత్రిణః ||

స|| నృపతి మంత్రిణః యత్ర తత్ ధనుః తాం మంజూషాం ఆదాయ సురోఫమం జనకం తే ఊచుః ||

తా|| ఆ రాజుయొక్క మంత్రులు ఆ ధనస్సు ఎక్కడవుందో ఆ మంజూషమును తీసుకు వచ్చి దేవులతో సమానుడగు జనకునితో ఇట్లు పలికిరి

ఇదం ధనుర్వరం రాజన్ పూజితం సర్వ రాజభిః |
మిథిలాధిప రాజేంద్ర దర్శనీయం యదిచ్ఛసి ||

స|| హే రాజేంద్ర ! హే రాజన్ ! మిథిలాధిప !ఇదం సర్వ రాజభిః పూజితం వరం ధనుః దర్శనీయం యదిచ్ఛసి ||

తా|| "ఓ రాజేంద్ర ! ఓ రాజన్ !ఓ మిథిలాధిపా ! ఈ రాజులందరిచే పూజింపబడు శ్రేష్ఠమైన ధనస్సును మీ ఇచ్చానుసారము చూపించవచ్చును".

తేషాం నృపో వచః శ్రుత్వా కృతాంజలిరభాషత |
విశ్వామిత్రం మహాత్మానం తౌ చోభౌ రామలక్ష్మణౌ ||

స|| తేషాం వచః శ్రుత్వా నృపః కృతాంజలిః మహాత్మానం విశ్వామిత్రం తౌ ఉభౌ రామలక్ష్మణౌ చ అభాషత ||

తా|| వారి మాటలను విని రాజు అంజలి ఘటించి మహాత్ముడైన విశ్వామిత్రుడు మరియు ఆ ఇద్దరూ రామలక్ష్మణులతో ఇట్లు పలికెను.

ఇదం ధనుర్వరం బ్రహ్మన్ జనకైరభిపూజితమ్ |
రాజభిశ్చ మహావీర్యైః అశక్తైః పూరితుం పురా ||

స|| హే బ్రహ్మన్ ! ఇదం ధనుః జనకైః అభిపూజితమ్ |పురా మహావీర్యైః రాజభిశ్చ పూరితుం అశక్తైః ||

తా|| "ఓ బ్రహ్మన్ ! ఈ ధనస్సు జనకుజులచే పూజింపబడినది. పూర్వము మహావీరులగు రాజులు ఎక్కుపెట్టుటకు అశక్తులైరి".

నైతత్ సురగణాస్సర్వే నా సురా న చ రాక్షసాః |
గంధర్వ యక్ష ప్రవరాః సకిన్నరమహోరగాః ||
క్వగతిర్మానుషాణాం తు ధనుషోs స్య ప్రపూరణే |
ఆరోపణే సమాయోగే వేపనే తోలనేs పి వా ||

స|| న ఏతత్ సర్వే సురగణాః న అసురాః న చ రాక్షసాః గంధర్వ యక్ష ప్రవరాః కినర మహోరగాః అస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనేపి వా ( అశక్తైః) ! మనుషాణాం క్వ గతిః ||

తా|| "సురగణములలో కాని అసురలలోకాని , రాక్షసులు గంధర్వులు యక్షులు కిన్నరులు మహోరగములలోనూ ఎవరు ఆ ధనస్సును ఎక్కుపెట్టుటకుగాని సంధించుటకు గాని అల్లే తాడును లాగుటకు కాని , చివరికి ధనస్సు ఎత్తుటకు కాని సమర్థులు కాలేకపోయిరి. ఇంక మనుష్యుల సంగతి చెప్పనేల".

తదేతద్దనుషాం శ్రేష్ఠం ఆనీతం మునిపుంగవ |
దర్శయైతన్మహాభాగ అనయో రాజపుత్రయోః ||

స|| హే మహాభాగ ! హే మునిపుంగవ ! తత్ ఏతత్ శ్రేష్ఠం ధనుషాం అనయో రాజపుత్రయోః దర్శయై ఆనీతం ||

తా|| "ఓ మహాభాగా ! ఓ మునిపుంగవ ! అట్టి ఈ శ్రేష్ఠమైన ధనస్సు ఈ రాజపుత్రులు చూచుటకు తీసుకు రాబడినది" .

విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితమ్ |
వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవ మబ్రవీత్ ||

స|| జనక భాషితం ( తత్ వాక్యం) శ్రుత్వా ధర్మాత్మా విశ్వామిత్రః తు రాఘవం ,- "వత్స రామ ధనుః పశ్య" ఇతి అబ్రవీత్ ||

తా|| జనకుడు చెప్పిన ఆమాటలు విని ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు రామునితో ,"నాయనా రామా ధనుస్సును చూడుము " అని చెప్పెను.

బ్రహ్మర్షేర్వచనాద్రామో యత్ర తిష్ఠతి తద్దనుః|
మంజూషాం తాం అపావృత్య దృష్ట్వా ధనురథాబ్రవీత్ ||

స|| బ్రహ్మర్షే వచనాత్ రామః యత్ర ధనుః తిష్ఠతి తత్ మంజూషాం అపావృత్య ధనుః దృష్ట్వా అథ అబ్రవీత్ ||

తా|| ఆ బ్రహ్మర్షి యొక్క మాటలతో రాముడు ధనస్సు వున్న మంజూష దగ్గరికి వచ్చి ధనస్సును చూచి పిమ్మట ఇట్లు పలికెను.

ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహా పాణినా |
యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణే పిs వా ||

స|| హే బ్రహ్మన్ ! ఇదం వరం ధనుః ఇహ పాణీనా సంస్పృశామి తోలనే పూరణేపి వా యత్నవాం చ భవిష్యామి?

తా|| "ఓ బ్రహ్మన్ ! ఈ శ్రేష్ఠమైన ధనస్సును చేతితో స్పృశించుచున్నాను. ఏత్తి ఎక్కుపెట్టుటకు ప్రయత్నము చేసెదను"

భాఢమిత్యేవ తం రాజా మునిశ్చ సమభాషత |

స|| తం రాజా మునిః చ భాఢం ఇతి సమభాషత ||

తా|| ఆ రాజు ముని వానితో ( రామునితో) "సరే" అని పలికిరి.

లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః |
పశ్యతాం నృసహస్రాణాం బహూనాం రఘునందనః ||
అరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధనుః|
తద్భభంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః ||

స|| మునేః వచనాత్ బహూనాం నృపసహస్రాణాం పశ్యతాం రఘనందనః స ధనుః లీలయా మధ్యే జగ్రాహ | నరశ్రేష్ఠః మహాయశాః సః ధర్మాత్మా తత్ ధనుః ఆరోపయిత్వా పూరయామాస | తత్ ధనుః మధ్యే భభంజ ||

తా|| ఆ ముని యొక్క మాటతో వేలకొలదీ రాజులు చూచుండగా ఆ రఘునందనుడు ధనస్సుని మధ్యభాగములో అవలీలగా పట్టుకొనెను. నరశ్రేష్ఠుడు మహాయశస్సు గల ఆ ధర్మాత్ముడు ధనస్సుని ఎక్కుపెట్టి సంధించెను. ఆ ధనస్సు మధ్యలో విరిగిపోయెను.

తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాతసమనిస్వనః |
భూమికంపశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః ||

స|| తస్య శబ్ధః నిర్ఘాత సమ నిశ్వనః మహాన్ ఆసీత్ | భూమిః కంపః చ | సుమహాన్ పర్వత ఏవ దీర్యతః ||

తా|| ఆ శబ్దము నిర్ఘాతపెట్టు సమముగా బ్రహ్మాండముగా నుండెను. భూమి కంపించెను, మహాపర్వతములు బ్రద్దలైనట్లు అనిపించెను.

నిపేతుశ్చ నరాస్సర్వే తేన శబ్దా మోహితః |
వర్జయిత్వా మునివరం రాజానం తౌ చ రాఘవౌ |||

స|| మునివరం రాజానం రాఘవౌ చ వర్జయిత్వా నరాః సర్వే తేన శబ్దేన మోహితాః నిపేతుః చ ||

తా|| ఆ మునివరుడు , మహరాజు ,రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ ఆ శబ్దముతో మూర్చిల్లి పడిపోయిరి.

ప్రత్యాశ్వస్తే జనే తస్మిన్ రాజా విగత సాధ్వసః |
ఉవాచ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో మునిపుంగవమ్||

స|| జనే తస్మిన్ ప్రత్యాశ్వస్తే | రాజా అపి విగత సాధ్వసః ప్రాంజలిః వ్యాక్యజ్ఞో మునిపుంగమ్ వాక్యం ఉవాచ ||

తా|| జనులు ఆ మూర్చనుండి తేరుకొనిరి. రాజు కూడా కుదుటపడిన మనస్సుతో అంజలి ఘటించి వాక్యజ్ఞుడైన ఆ మునిపుంగవునితో ఈ మాటలు పలికెను.

భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజ |
అత్యద్భుతమచింత్యం చ న తర్కికమిదం మయా ||

స|| హే భగవన్ ! అత్యద్భుతం అచిన్త్యం న తర్కికం దశరథాత్మజః రామో ఇదం వీర్యః మే దృష్టః |

తా|| "ఓ భగవన్ !దశరథాత్మజుడైన రాముని పరాక్రమమును నేను చూచితిని. అది అత్యద్భుతము అయినది , అలోచనలకు అందనిది, అట్లు అగునని తలంచనిది."

జనకానాం కులే కీర్తిమ్ ఆహరిష్యతి మే సుతా |
సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజమ్ ||

స|| సీతా రామం దశరథాత్మజం భర్తారం ఆసాద్య మే సుతా జనకానాం కులే కీర్తిమ్ అహరిష్యతి |

తా|| "సీత దశరథాత్మజుడగు రాముని భర్తగా పొంది , నా కుమార్తె జనకుని కులప్రతిష్ఠ పెంచ గలదు".

మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్యశుల్కేతి కౌశిక |
సీతా ప్రాణైర్బహుమతా దేయా రామాయ మే సుతా ||

స|| హే కౌశిక ! వీర్యశుల్కః ఇతి మమ ప్రతిజ్ఞా సత్యా మే సుతా ప్రాణైః బహుమతా సీతా రామాయ దేయా ||

తా|| "ఓ కౌశికా !( సీత) వీర్యశుల్కము అన్న నా ప్రతిజ్ఞ సత్యమైనది. నా ప్రాణములతో సమానమైన సీత రామునికి ఇయ్యతగినది".

భవతోs నుమతే బ్రహ్మన్ శీఘ్రం గచ్ఛంతు మంత్రిణః |
మమకౌశిక భద్రం తే అయోధ్యాయాం త్వరితా రథైః ||

స|| హే బ్రహ్మన్ ! భద్రం తే | హే కౌశిక ! భవతో అనుమతే మమ మంత్రిణః త్వరితా రథైః శీఘ్రం అయోధ్యాయాం గచ్ఛంతు |

తా|| "ఓ బ్రహ్మన్ ! మీకు శుభమగుగాక ! ఓ కౌశికా! మీ అనుమతితో నా మంత్రులు త్వరగా పోవు రథములపై శీఘ్రముగా అయోధ్య వెళ్ళెదరు".

రాజానం ప్రశ్రితైర్వాక్యైః ఆనయంతు పురం మమ |
ప్రదానం వీర్యశుల్కయాః కథయంతు చ సర్వశః ||

స|| సర్వశః వీర్య శుల్కయాః ప్రదానం కథయంతు రాజానం ప్రశ్రితైః వాక్యైః మమ పురం ఆనయంతు ||

తా|| "వినమ్ర వచనములతో వీర్య శుల్క ప్రదానమును చెప్పెదరు. ఆ రాజుని మా నగరమునకు తీసుకొని వత్తురు".

మునిగుప్తౌ చ కాకుత్ స్థౌ కథయంతు నృపాయవై |
ప్రీయమానం తు రాజానమ్ ఆనయంతు సు శీఘ్రగాః||

స||నృపాయ కాకుత్‍స్థౌ మునిగుప్తౌ చ కథయంతు | సుశీఘ్రగాః ప్రీయమానం రాజానమ్ ఆనయంతు తు ||

తా|| "ఆ మహరాజుకు మునిరక్షణలో నున్నకాకుత్‍స్థులను ఇద్దరి గురించి చెప్పెదరు. ప్రీతిచెందిన ఆ మహరాజు ను తీసుకు వచ్చెదరు".

కౌశికశ్చ తధేత్యాహ రాజా చా భాష్య మంత్రిణః |

స|| కౌశికః తథేతి ఆహ | రాజాచ మంత్రిణః భాష్య చ ||

తా|| కౌశికుడు అటులనే అని అనెను. రాజు మంత్రులతో మాట్లాడెను.

అయోధ్యాయాం ప్రేషయామాస ధర్మాత్మా కృతశాసనాన్ |
యథావృత్తం సమఖ్యాతుం ఆనేతుం చ నృపం తథా ||

స|| (సః) ధర్మాత్మా యథావృత్తం సమాఖ్యాతుం తథా నృపం ఆనేతుం చ కృతశాసనాన్ అయోధ్యాయాం ప్రేషయామాస ||

తా|| ఆ ధర్మాత్ముడు జరిగిన వృత్తాంతము చెప్పుటకు అలాగే ఆ మహారాజుని తీసుకు వచ్చుటకు కార్య దక్షులను అయోధ్యా నగరమునకు పంపెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్తషష్టితమ స్సర్గః ||
సమాప్తం ||

|| om tat sat ||